View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

దాశరథీ శతకమ్

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబన్ధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 1 ‖

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాఙ్గనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశామ్భుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 2 ‖

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరన్ద పదకఞ్జ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 3 ‖

రఙ్గదరాతిభఙ్గ, ఖగ రాజతురఙ్గ, విపత్పరమ్పరో
త్తుఙ్గ తమఃపతఙ్గ, పరి తోషితరఙ్గ, దయాన్తరఙ్గ స
త్సఙ్గ ధరాత్మజా హృదయ సారసభృఙ్గ నిశాచరాబ్జమా
తఙ్గ, శుభాఙ్గ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ౤ ‖ 4 ‖

శ్రీద సనన్దనాది మునిసేవిత పాద దిగన్తకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సిన్ధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 5 ‖

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాఙ్గుడనై రఘునాధ భట్టరా
రార్యుల కఞ్జలెత్తి కవి సత్తములన్ వినుతిఞ్చి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకమ్బొన గూర్చి రచిన్తునేడుతా
త్పర్యమునన్ గ్రహిమ్పుమిది దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 6 ‖

మసకొని రేఙ్గుబణ్డ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెన్ది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుం బూతవృత్తిసుక రమ్బుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రఙ్గమునన్దునటిమ్ప వయ్యసం
తసము జెన్ది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 7 ‖

శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురన్త పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 8 ‖

దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బన్ధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిన్దనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 9 ‖

కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాణ్డకాణ్డ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కన్దకున్ద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 10 ‖

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చమ్పక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగిమ్పుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 11 ‖

గురుతరమైన కావ్యరస గుమ్భనకబ్బుర మన్దిముష్కరుల్
సరసులమాడ్కి సన్తసిల జూలుదురోటుశశాఙ్క చన్ద్రికాం
కురముల కిన్దు కాన్తమణి కోటిస్రవిఞ్చిన భఙ్గివిన్ధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 12 ‖

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువఙ్కయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణిమ్ప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 13 ‖

దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురన్త దుర్మతా
చారభయఙ్క రాటవికి జణ్డకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 14 ‖

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమన్త్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరిఞ్చుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటిమ్పజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 15 ‖

ముప్పున గాలకిఙ్కరులు ముఙ్గిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిణ్డినవేళ, బాన్ధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 16 ‖

పరమదయానిధే పతితపావననామ హరే యటఞ్చు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడఞ్చు యముణ్డు కిఙ్కరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 17 ‖

అజునకు తణ్డ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొన్దుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతిఞ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 18 ‖

పణ్డిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసమ్భవా
ఖణ్డల పూజితుణ్డు దశకణ్ఠ విలుణ్ఠన చణ్డకాణ్డకో
దణ్డకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దణ్డలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 19 ‖

శ్రీరమ సీతగాగ నిజసేవక బృన్దము వీరవైష్ణవా
చార జవమ్బుగాగ విరజానది గౌతమిగా వికుణ్ఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసిఞ్చు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 20 ‖

కణ్టి నదీతటమ్బుబొడగణ్టిని భద్రనగాధివాసమున్
గణ్టి నిలాతనూజనురు కార్ముక మార్గణశఙ్ఖచక్రముల్
గణ్టిని మిమ్ము లక్ష్మణుని గణ్టి కృతార్ధుడ నైతి నో జగ
త్కణ్టక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 21 ‖

హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభఙ్గి దప్పిచే
నలమట జెన్దువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటిమ్పజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 22 ‖

కొఞ్జకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రఞ్జిలద్రవ్వి కఙ్గొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాఞ్జనమన్దుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కఞ్జమునన్ వసిమ్పుమిక దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 23 ‖

రాముణ్డు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముణ్డు రాముడే పరమ దైవము మాకని మీ యడుఙ్గు గెం
దామరలే భుజిఞ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 24 ‖

చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసఙ్గిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 25 ‖

'రా' కలుషమ్బులెల్ల బయలమ్బడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నన్దదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఙ్గానరు గాక విపత్పరమ్పరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 26 ‖

రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటఞ్చు మది రఞ్జిల భేకగళమ్బులీల నీ
నామము సంస్మరిఞ్చిన జనమ్బు భవమ్బెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 27 ‖

చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెఞ్జిగురాకు మోవికిం
జొక్కపుజుణ్టి తేనియకు జొక్కులుచుఙ్గన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకణ్టె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 28 ‖

అణ్డజవాహ నిన్ను హృదయమ్బుననమ్మిన వారి పాపముల్
కొణ్డలవణ్టివైన వెసగూలి నశిమ్పక యున్నె సన్త తా
ఖణ్డలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దణ్డయొసఙ్గకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 29 ‖

చిక్కనిపాలపై మిసిమి జెన్దిన మీగడ పఞ్చదారతో
మెక్కినభఙ్గి మీవిమల మేచకరూప సుధారసమ్బు నా
మక్కువ పళ్లేరమ్బున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటఞ్చు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 30 ‖

సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమన్తుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితమ్బులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపఞ్జరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 31 ‖

హలికులిశాఙ్కుశధ్వజ శరాసన శఙ్ఖరథాఙ్గ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదామ్బుజ ద్వయము గౌతమపత్ని కొసఙ్గినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 32 ‖

జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యఙ్గముగీటిబలీన్ద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దమ్బముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 33 ‖

భణ్డన భీముడా ర్తజన బాన్ధవుడుజ్జ్వల బాణతూణకో
దణ్డకళాప్రచణ్డ భుజ తాణ్డవకీర్తికి రామమూర్తికిన్
రెణ్డవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాణ్డద దాణ్డ దాణ్డ నిన దమ్బులజాణ్డము నిణ్డమత్తవే
దణ్డము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 34 ‖

అవనిజ కన్నుదోయి తొగలన్దు వెలిఙ్గెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొణ్డల నుణ్డు ఘనమ్బ మైధిలీ
నవనవ యౌవనమ్బను వనమ్బుకున్ మదదన్తి వీవెకా
దవిలి భజిన్తు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 35 ‖

ఖరకరవంశజా విను ముఖణ్డిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపఞ్జరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదఙ్క మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 36 ‖

జుర్రెదమీక థామృతము జుర్రెదమీపదకఞ్జతో యమున్
జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసమ్బ నే
జుర్రెద జుర్రుజుర్రుఙ్గ రుచుల్ గనువారిపదమ్బు గూర్పవే
తుర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 37 ‖

ఘోరకృతాన్త వీరభట కోటికి గుణ్డెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుణ్ఠ మన్దిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 38 ‖

విన్నపమాలకిఞ్చు రఘువీర నహిప్రతిలోకమన్దు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులన్దు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 39 ‖

పెమ్పునన్దల్లివై కలుష బృన్దసమాగమ మొన్దుకుణ్డు ర
క్షిమ్పనుదణ్డ్రివై మెయు వసిఞ్చుదు శేన్ద్రియ రోగముల్ నివా
రిమ్పను వెజ్జవై కృప గుఱిఞ్చి పరమ్బు దిరబుగాఙ్గ స
త్సమ్పదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 40 ‖

కుక్షినజాణ్డపం క్తులొన గూర్చి చరాచరజన్తుకోటి సం
రక్షణసేయు తణ్డ్రివి పరమ్పర నీ తనయుణ్డనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 41 ‖

గద్దరియో గిహృత్కమల గన్ధర సానుభవమ్బుఞ్జెన్దు పె
న్నిద్దవు గణ్డుం దేణ్టి థరణీసుత కౌఙ్గిలిపఞ్జరమ్బునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఙ్గదే
తద్దయు నేణ్డు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 42 ‖

కలియుగ మర్త్యకోటినిను గఙ్గొన రానివిధమ్బో భక్తవ
త్సలతవహిమ్పవో చటుల సాన్ద్రవిపద్దశ వార్ధి గ్రుఙ్కుచో
బిలిచిన బల్క విన్తమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 43 ‖

జనవర మీక థాలి వినసైమ్పక కర్ణములన్దు ఘణ్టికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసఙ్గు దోసనం
దననుత మాకొసఙ్గుమయ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 44 ‖

పాపము లొన్దువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొన్దువేళ భరతాగ్రజ మిమ్ము భజిఞ్చువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మామ్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధి౤ ‖ 45 ‖

అగణిత జన్మకర్మదురి తామ్బుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరిమ్పగోరితి బదమ్పబడి నదు భయమ్భు మామ్పవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 46 ‖

నేనొనరిఞ్చు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొణ్టి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెన్దెగావునన్
దాని ధరిమ్పగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 47 ‖

పరధనముల్ హరిఞ్చి పరభామలనణ్టి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీన్దనగు మోసమెఱుఙ్గదు మానసమ్బు
స్తరమదికాలకిఙ్కర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 48 ‖

చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములం జేరి భజిఞ్చిన వారిపొన్దు నేం
జేసిన నేరముల్ దలఞ్చి చిక్కులమ్బెట్టకుమయ్యయయ్య నీ
దాసుణ్డనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 49 ‖

పరుల ధనమ్బుఞ్జూచిపర భామలజూచి హరిమ్పగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొఙ్గనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములం జుట్టి భవచ్చరణమ్బనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 50 ‖

సలలిత రామనామ జపసార మెఱుఙ్గను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతిమ్ప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 51 ‖

పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలఞ్చిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖమ్బుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొన్దెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 52 ‖

మామక పాతక వజ్రము మ్రామ్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధిఞ్చునొ? కాలకిఙ్కర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దిన్తకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 53 ‖

దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసఙ్గినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకణ్డ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 54 ‖

దీక్షవహిఞ్చి నాకొలది దీనుల నెన్దఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలఞ్చినన్తనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగిఞ్చి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 55 ‖

నీలఘనాభమూర్తివగు నిన్ను గనుఙ్గొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 56 ‖

వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితమ్బు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువణ్టిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనమ్బులో
దలతుమెకా నిరన్తరము దాశరథీ కరునాపయోనిధీ౤ ‖ 57 ‖

తప్పులెఱుఙ్గ లేక దురితమ్బులు సేసితినణ్టి నీవుమా
యప్పవుగావు మణ్టి నికనన్యులకున్ నుదురణ్టనణ్టినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బణ్టుకు బటవణ్టి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 58 ‖

ఇతడు దురాత్ముడఞ్చుజను లెన్నఙ్గ నాఱడిఙ్గొణ్టినేనెపో
పతితుణ్డ నణ్టినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేణ్డనణ్టి నిహ మిచ్చిననిమ్ముపరమ్బొసఙ్గుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరన్తరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 59 ‖

అఞ్చితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షిఞ్చిన జాలుదాననిర సిఞ్చెదనాదురితమ్బు లెల్లదూ
లిఞ్చెద వైరివర్గ మెడలిఞ్చెద గోర్కులనీదుబణ్టనై
దఞ్చెద, గాలకిఙ్కరుల దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 60 ‖

జలనిధు లేడునొక్క మొగిం జక్కికిదెచ్చెశరమ్బు, ఱాతినిం
పలరఙ్గ జేసెనాతిగమ్బ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఙ్గ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 61 ‖

కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివిన్త? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 62 ‖

భూపలలామ రామరఘుపుఙ్గవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ౤ ‖ 63 ‖

నీసహజమ్బు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుణ్డు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చన్ద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 64 ‖

చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవిన్త, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి విన్తగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెన్దిన దెన్తవిన్త? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 65 ‖

దైవము తల్లిదణ్డ్రితగు దాత గురుణ్డు సఖుణ్డు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 66 ‖

వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనమ్బుగూర్చినం
గాసును వెణ్టరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవమ్బునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 67 ‖

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాఙ్గనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుఙ్గులే రకట దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 68 ‖

వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేన్ద్రునిం
జేరి వధిఞ్చి వేదముల చిక్కెడలిఞ్చి విరిఞ్చికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 69 ‖

కరమనుర క్తిమన్దరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథిఞ్చుచున్నచో
ధరణిచలిమ్పలోకములు తల్లడమన్దగ గూర్మమై ధరా
ధరము ధరిఞ్చితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 70 ‖

ధారుణి జాపజుట్టిన విధమ్బునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధిఞ్చి వరాహమూర్తివై
ధారుణిదొణ్టికై వడిని దక్షిణశృఙ్గమున ధరిఞ్చి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 71 ‖

పెటపెటనుక్కు కమ్బమున భీకరదన్త నఖాన్తర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భణ్డనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళిఞ్చి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 72 ‖

పదయుగళమ్బు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీన్ద్రునొక పాదమునన్దల క్రిన్దనొత్తిమే
లొదవజగత్త్రయమ్బు బురు హూతునికియ్యవటుణ్డవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 73 ‖

ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధిఞ్చి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసఙ్గితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 74 ‖

దురమున దాటకన్దునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమన్ది తణ్డ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచణ్డ కాణ్డకులిశాహతి రావణకుమ్భకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 75 ‖

అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనిఞ్చి కుజనావళినెల్ల నడఞ్చి రోహిణీ
తనయుడనఙ్గ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 76 ‖

సురలునుతిమ్పగా ద్రిపుర సున్దరుల వరియిమ్పబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహిఞ్చునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరిఞ్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 77 ‖

సఙ్కరదుర్గమై దురిత సఙ్కులమైన జగమ్బుజూచి స
ర్వఙ్కషలీల ను త్తమ తురఙ్గమునెక్కి కరాసిబూని వీ
రాఙ్కవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తఙ్క మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 78 ‖

మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననణ్టి మేనిబిగి దప్పకమున్నెనరుణ్డు మోక్ష సా
ధన మొనరిమ్పఙ్గావలయుం దత్త్వవిచారము మానియుణ్డుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 79 ‖

ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాఙ్కుశమ్బు సం
పదల కొటారు కోరికల పణ్ట పరమ్బున కాది వైరుల
న్నదన జయిఞ్చుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 80 ‖

దురిత లతానుసార భయ దుఃఖ కదమ్బము రామనామభీ
కరతల హేతిచేం దెగి వకావకలై చనకుణ్డ నేర్చునే
దరికొని మణ్డుచుణ్డు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 81 ‖

హరిపదభక్తినిన్ద్రియజ యాన్వితుడుత్తముణ్డిన్ద్రిమమ్బులన్
మరుగక నిల్పనూదినను మధ్యముణ్డిన్ద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 82 ‖

వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఞ్జిక్కెఞ్జిల్వగను వేన్దుఱుం జెన్దెను లేల్లు తావిలో
మనికినశిఞ్చె దేటితర మాయిరుమూణ్టిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 83 ‖

కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుణ్డనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 84 ‖

చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సఙ్ఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీన్ద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 85 ‖

భానుడు తూర్పునన్దుగను పుట్టినం బావక చన్ద్ర తేజముల్
హీనత జెన్దినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నం బర దైవమరీచులడఙ్గకుణ్డు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 86 ‖

నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుఙ్కులాడకవృ థాతనుకష్టముజెన్ది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునిఙ్గిన దుర్వికార హృ
తామసపఙ్కముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 87 ‖

నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుఙ్కులాడకవృ థాతనుకష్టముజెన్ది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునిఙ్గిన దుర్వికార హృ
తామసపఙ్కముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 88 ‖

కాఞ్చన వస్తుసఙ్కలిత కల్మష మగ్ని పుటమ్బు బెట్టెవా
రిఞ్చినరీతి నాత్మనిగిడిఞ్చిన దుష్కర దుర్మలత్రయం
బఞ్చిత భ క్తియోగ దహ నార్చిన్దగుల్పక పాయునే కన
త్కాఞ్చనకుణ్డలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 89 ‖

నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషమ్బుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజిఞ్చినం గల్గకుణ్డునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 90 ‖

వారిజపత్రమన్దిడిన వారివిధమ్బున వర్తనీయమం
దారయ రొమ్పిలోన దను వణ్టని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలఙ్గుచు విచారడైపరమొన్దుగాదెస
త్కార మెఱిఙ్గి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 91 ‖

ఎక్కడి తల్లిదణ్డ్రి సుతులెక్కడి వారు కళత్ర బాన్ధవం
బెక్కడ జీవుణ్డెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొన్దిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెణ్టనణ్టిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలన్దిడక దాశరథీ కరుణా పయోనిధీ౤ ‖ 92 ‖

దొరసినకాయముల్ముదిమి తోచినఞ్జూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోన్దమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుఙ్గక మోహపాశము
ళరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 93 ‖

సిరిగలనాణ్డు మైమఱచి చిక్కిననాణ్డుదలఞ్చి పుణ్యముల్
పొరిమ్బొరి సేయనైతినని పొక్కినం గల్గు నెగాలిచిచ్చుపైం
గెరలిన వేళన్దప్పికొని కీడ్పడు వేళ జలమ్బు గోరి త
త్తరమునం ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 94 ‖

జీవనమిఙ్కం బఙ్కమున జిక్కిన మీను చలిమ్పకెన్తయు
దావుననిల్చి జీవనమె దద్దయుం గోరువిధమ్బు చొప్పడం
దావలమైనఙ్గాని గుఱి తప్పనివాణ్డు తరిఞ్చువాణ్డయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 95 ‖

సరసునిమానసమ్బు సర సజ్ఞుడెరుఙ్గును ముష్కరాధముం
డెఱిఙ్గిగ్రహిఞ్చువాడె కొల నేకనిసముం గాగదుర్దురం
బరయఙ్గ నేర్చునెట్లు విక చాబ్దమరన్ద రసైక సౌరభో
త్కరముమిళిన్ద మొన్దుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 96 ‖

నోఞ్చినతల్లిదణ్డ్రికిం దనూభవుణ్డొక్కడెచాలు మేటిచే
చాఞ్చనివాడు వేఱొకణ్డు చాచిన లేదన కిచ్చువాణ్డునో
రాఞ్చినిజమ్బకాని పలు కాడనివాణ్డు రణమ్బులోన మేన్
దాచనివాణ్డు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 97 ‖

శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిం జేసితి నామనమ్బునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమన్దఙ్గ జేసి సత్కళా
దాయి ఫలమ్బునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 98 ‖

ఎన్తటిపుణ్యమో శబరి యెఙ్గిలిగొణ్టివి విన్తగాదె నీ
మన్తన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాఙ్కురమ్బులన్
సన్తసమన్దం జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాన్తముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 99 ‖

బొఙ్కనివాణ్డెయోగ్యుడరి బృన్దము లెత్తిన చోటజివ్వకుం
జఙ్కనివాణ్డెజోదు రభసమ్బున నర్థి కరమ్బుసాఞ్చినం
గొఙ్కనివాణ్డెదాత మిముం గొల్చిభజిఞ్చిన వాణ్డె పోనిరా
తఙ్క మనస్కుం డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 100 ‖

భ్రమరముగీటకమ్బుం గొని పాల్పడి ఝాఙ్కరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటం జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తమ్బుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరిఞ్చు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 101 ‖

తరువులు పూచికాయలగు దక్కుసుమమ్బులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకామ్బర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 102 ‖

పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుణ్డ్రముల్
వెట్టితిమన్త్రరాజ మొడి బెట్టితి నయ్యమకిఙ్క రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కఞ్జలన్దుం దలమ్పుపెట్టి బో
దట్టితిం బాపపుఞ్జముల దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 103 ‖

అల్లన లిఙ్గమన్త్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దమ్బ్రసిద్ధిడనై భవదఙ్కితమ్బుగా
నెల్లకవుల్ నుతిమ్ప రచియిఞ్చితి గోపకవీన్ద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ౤ ‖ 104 ‖