రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది
పల్లవి:
గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా
అను పల్లవి:
అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గంధము॥
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ॥గంధము॥
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ॥గంధము॥
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ॥గంధము॥
Browse Related Categories: