అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు
రాగం: కానడ
రాముడు రాఘవుడు రవికులు డితడు ।భూమిజకు పతియైన పురుష నిధానము ॥
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున ।పరగ జనించిన పర బ్రహ్మము ।సురల రక్షింపగ అసురుల శిక్షింపగ ।తిరమై ఉదయించిన దివ్య తేజము ॥
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో ।సంతతము నిలిచిన సాకారము ।వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి ।కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ॥
వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు ।పాదుకొన పలికేటి పరమార్ధము ।ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన ।ఆదికి అనాదియైన అర్చావతారము ॥
Browse Related Categories: